ఒక ప్రేమ కథ – 12

ఆర్యన్ తన ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోయాం…
రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాను కాబట్టి అమ్మ చాల గారం చేసింది. నేను ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, “చాలా చిక్కిపోయావే, అసలేం తినలేదా ఈ రెండు నెలలు…” అంది.
“అబ్బా… అదేం లేదు స్వీటీ… బానే ఉన్నాను నేను. కానీ, నీ చేతి వంటని మాత్రం బా… మిస్ అయ్యాను తెలుసా…” అని మా అమ్మని గట్టిగా పట్టుకుని చెప్పాను.
“అలా అనకే బాబు… నువ్వు వెళ్ళినప్పటినుంచి సరిగ్గా ఏం వండట్లేదు మీ స్వీటీ…” అని అన్నారు అప్పా.
“అవునా.. ఇప్పుడు నేను వచ్చేసానుగా.. ఇంక బావుంటుందిలే… కదా స్వీటీ!” అన్నాను నేను, మా అమ్మ వొళ్ళో తలపెట్టి మంచం మీద వాలుతూ…
తర్వాత, మా అమ్మ ఆయిల్ మసాజ్ చేసింది. జుత్తు సన్నబడిపోయిందని, అస్సలు కేర్ తీసుకోడం లేదని ఎప్పట్లాగే స్తోత్రం చదివింది. నేను కూడ ఎప్పుడు లాగె ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసాను.
తర్వాత మా అమ్మచేతి రుచికరమైన వంటలన్నీ తిన్నాను. జర్నీ చేసొచ్చాను కాబట్టీ మధ్యాహ్నం నిద్రపోయాను…
సాయంత్రం అప్పా ఆఫీస్ నుంచి వచ్చాక లేచాను… మళ్ళీ బోలెడు కబుర్లు చెప్పుకున్నాం.. తర్వాత కిట్టూతో ఆడుకున్నాను.
అలా.. రోజంతా హాయిగా గడిచిపోయింది. రాత్రి భోజనం టైం అయ్యింది. ముగ్గురం కూర్చుని చపాతీలు తింటున్నాం…
“ఆర్యన్ ఏ టైంకి వస్తాడో కనుక్కున్నావా..?” అడిగారు అప్పా.
“వచ్చినప్పటినుంచీ అస్సలు ఫోన్నే తియ్యలేదు, బేగ్*లోనే ఉండిపోయిందేమో..!” అన్నాను నేను.
“తను నీకు కాల్ చేస్తున్నాడు కదా, మరి అలా ఎలా చేసావ్?” అడిగారు ఆయన.
“I am sorry… కానీ, నాకు అస్సలు ఆ ధ్యాసే లేదు. కావాలని చేసింది కాదు,” అన్నాను నేను తలదించుకుంటూ.
“తినేసాకయినా తనకి కాల్ చెయ్,” అన్నారు. దానికి, “సరే,” అని జవాబిచ్చాను.
అమ్మ ఆర్యన్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు. కానీ, అప్పా తనకి అన్నీ చెప్పారని మాత్రం చెప్పింది. తనకి ఇష్టమో లేదో ఏం చెప్పలేదు… ‘వన్స్ ఆర్యన్ ఇంటికి లంచ్ కి వస్తే అప్పుడు పరిచయం అయ్యాక అడుగుదాంలే…’ అని నేను కూడా ఏం అడగలేదు.
డిన్నర్ తర్వాత, బేగ్ లో నుంచి మొబైల్ తీసాను. చార్జింగ్ లాస్ట్ పాయింట్ లో ఉంది. వెంటనే ఛార్జింగ్ పెట్టాను.
దాన్లో 120 మిస్సడ్ కాల్స్ ఉన్నాయి. అందులో 5 !dea కాల్ సెంటర్ వి, మిగతావన్నీ ఆర్యన్ వి… ఇప్పుడు కాల్ చేస్తే భగ్గుమని మండిపడతాడు అనుకుంటూ తనకి కాల్ చేసాను.
“హలో..” అన్నాడు తను.
“సారీ..!” అన్నాను నేను.
“హ్మ్..” అన్నాడు తను.
“రేపు వస్తున్నావుగా…” అడిగాను నేను.
“హ్మ్..” అన్నాడు తను.
“ఏంటి.. హ్మ్.. హ్మ్… ఏదో ఒకటి చెప్పు..” అన్నాను నేను.
“వస్తున్నాను… ఇంకేం చెప్పాలి?” అడిగాడు తను.
“కోపమా..? సారీ చెప్పానుగా..” అన్నాను నేను.
“అరే… కోపం ఏం కాదు, నాకు తెల్సు… after 2 months మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళావ్ కాబట్టీ నీకు మ్యాగ్జిమమ్ టైం వాళ్ళతోనే spend చెయ్యాలి అని ఉంటుంది… కానీ, మధ్యలో ఒక్కసారైనా నేను గుర్తొస్తానేమో అనుకున్నాను, అంతే…” అన్నాడు తను.
“అబ్బా… సారీ.. కానీ, నిజంగా గుర్తులేదు నాకు…” అన్నాను నేను.
“Thank you..” అన్నాడు తను.
“Thanks నా..? ఏంటీ వెటకారమా..?” అడిగాను నేను.
“కాదు… నువ్వు కావాలంటే మొబైల్ చార్జ్ లేదనో, నేను కాల్ చేసా.. ఎంగేజ్ వచ్చిందనో ఏదో ఒక సాకు చెప్పచ్చు. కానీ, నిజం చెప్పావ్ గా… అందుకే, thank you చెప్పాను,” అన్నాడు తను.
తను నన్ను ఎంత బాగా అర్ధం చేస్కున్నాడో కదా అనిపించింది నాకు… ఇంకొన్ని ‘సారీ’లు చెప్పాను.
“శిశిరా… నాకెప్పుడూ అబద్ధం చెప్పకు, ఇలానే నిజాలు చెప్పు… బాధపెట్టేదయినా నిజమే బాగుంటుంది.. అప్పటికి బాధగా ఉన్నా అదే బాగుంటుంది. అబద్ధం చెప్పి సంతోషపెట్టకు… అప్పటికి సంతోషంగా ఉన్నా.. తర్వాత అబద్ధం అని తెలిస్తే ఆ బాధని భరించడం కష్టం,” అన్నాడు తను.
“హ్మ్… సరే, నువ్వు కూడా అలానే చెయ్యి,” అన్నా..
“హ్మ్…” అన్నాడు తను. తర్వాత, రేపు మార్నింగ్ 10:30 కి తను మా ఇంటికి వస్తానని చెప్పాడు.
“మీ అప్పాకి అయితే నేను ఇష్టమే కానీ, మీ అమ్మగారికి ఎలా నచ్చాలో కొంచెం టిప్స్ చెప్పు,” అని అడిగాడు తను.
“మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి టిప్స్ అంటే.. ఏముంటాయి, నువ్వు నీలా ఉండు అంతే, నచ్చేస్తావ్..” అని చెప్పాను.
“హ్మ్…. hope so… ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా ఎక్కువ టెన్షన్ గా ఉంది నాకు,” అన్నాడు తను.
“టాపర్ కి కూడా భయం వేస్తుందా..?” అడిగాను నేను.
“నువ్వు మనింటికి వస్తావ్ గా… అప్పుడు నేను కూడా అదే అడుగుతా నిన్ను…” అన్నాడు తను.
ఇద్దరం ఒకరికొకరం ‘All the Best’ చెప్పుకుని కాల్ కట్ చేసాము…
ఈసారి నాకేమీ టెన్షన్ లేదు. ఆర్యన్ తప్పకుండా మా అమ్మకి నచ్చుతాడు అనేది నా గట్టి నమ్మకం. సో, హ్యాపీగా పడుకున్నాను.
[size=undefined]
తెల్లవారింది, నేను లేటుగా లేచాను. అప్పటికే అప్పా మార్నింగ్ వాక్ నుంచి వచ్చేసారు.
“గుడ్ మార్నింగ్ అప్పా..” అంటూ వెళ్ళి విష్ చేసి ఆయన పక్కన కూర్చుని పేపర్ చదువుతున్నా… ఇంతలో మా స్వీటీ వచ్చి, “వెళ్ళి రెడీ అవ్వవే, ఈరోజు ఆర్యన్ వస్తాడన్నావుగా..” అంది మా అమ్మ.
“హ్మ్.. వెళ్తాలే..!” అని లేజీగా లేచి రెడీ అయ్యాను.
‘వినాయకా…!!! అంతా Pleasantగా సవ్యంగా జరిగిపోవాలి. ఆర్యన్ ఇంట్లో అందరికీ నచ్చేయాలి.మిగతావన్నీ మీకు తెలుసుగా.. నాకు ఏది మంచిదో, ఏది చెడో.
. సో, అన్నీ అలా చేసేయ్యండి’ అని pray చేసుకున్నాను.
అప్పా ఈరోజు ఆఫ్ తీసుకున్నాడు. నేను కిట్టూతో ఆడుకున్నాను. మాటిమాటికీ టైం చూస్తుంటే మా స్వీటీ, “వస్తాడులే… నువ్వెళ్ళి ఈ బట్టలు మేడ మీద ఆరేసి రా ఈలోపు,” అని అంది.
“నేనేమీ తనకోసం చూడట్లేదు… వెళ్ళి ఆరేసి వస్తాలే,” అని బకెట్ తీస్కొని మేడపైకి వెళ్ళాను. నా పని అయ్యి కిందకొచ్చానోలేదో ఆర్యన్ వచ్చాడు. నేను తనని చూసి ‘గుడ్ లక్’ చెప్పి లోపలికి తీసుకొచ్చాను.
“అమ్మా… అప్పా… ఆర్యన్ వచ్చాడు,” అని పిలిచాను. అమ్మ వచ్చింది.
“నమస్తే ఆంటీ,” అని విష్ చేసాడు తను. “అప్పా ఫోన్ మాట్లాడుతున్నారు, కొంచెంసేపట్లో వస్తారు, కూర్చోమను తనను,” అని నాతో చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది మా స్వీటీ… నేను తనని హాల్లో కూర్చోమని చెప్పి నా కిట్టూని తీసుకొచ్చాను.
“Very pretty..” అని దాంతో ఆడుకోడం స్టార్ట్ చేసాడు తను.
“నేను ఇప్పుడే వస్తాను,” అని స్వీటీ దగ్గరకి వెళ్ళాను.
“ఇదిగో… వాటర్ and ఫ్రూట్స్, వెళ్ళి ఇవ్వు తనకి,” అంది మా అమ్మ ట్రే నా చేతిలో పెడ్తూ…
“స్వీటీ, మాట్లాడవా నువ్వేమీ? ఒక్కసారొచ్చి తనని పలకరించొచ్చుగా..” అన్నాను నేను.
” మీ నాన్న వస్తారుగా.. ఆయన, నువ్వు మాట్లాడుకోండి, నా ఇష్టంతో పనేముంది మీకు,” అంది మా స్వీటీ.
“అదేంటి స్వీటీ… అలా అంటావ్! నీకు నచ్చకుండా నేనేపనైనా చేస్తానా… చెప్పు,” అన్నాను నేను.
“అందుకేగా… నీ లైఫ్* డెసిషన్ గురించి ఒక్కమాటైనా నాతో అనలేదు,” అంది.
నాకేం మాట్లాడాలో అర్ధంకాలేదు, మౌనంగా అలా తల దించుకొని నించున్నాను.
“వెళ్ళు, నాకు పనుంది… ఆ అబ్బాయి ఒక్కడే కూర్చున్నాడు హాల్లో..” అంది తను.
నేను ట్రే తీస్కుని వెళ్ళిపోయాను. ఆర్యన్ కి సెర్వ్ చేసాను. తను వాటర్ తాగాడు… తర్వాత మా అప్పా వచ్చారు. తను అప్పా మాట్లాడుకుంటున్నారు… నేను మాత్రం వాళ్ళ డిస్కషన్ లో పాల్గోలేదు. నా ఆలోచనలన్నీ మా అమ్మ మాటల చుట్టూనే తిరుగుతున్నాయి ఇంకా…
అలా టైం గడిచిపోయింది.
“లంచ్ వడ్డించాను, భోజనానికి రండి,” అని అమ్మ వచ్చి అందరికీ చెప్పింది.
ఆర్యన్ అప్పాకి అయితే నచ్చేసాడు… వాళ్ళిద్దరూ చాల కంఫర్టెబుల్ గా మాట్లాడుకుంటున్నారు. స్వీటీ నా పక్కన కూర్చుంది. అందరం కల్సి లంచ్ స్టార్ట్ చేసాం. స్వీటీ వంటని ఆర్యన్ మెచ్చుకున్నాడు. కానీ, స్వీటీ మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. లంచ్ చేయడం పూర్తయ్యింది… మళ్ళీ అందరం హాల్లో కూర్చున్నాం. ఈసారి స్వీటీ కూడా మాతోపాటు కూర్చుంది.
ఏవో మాటల్లో, “శిశిర చాల మొండి బాబు,” అన్నారు మా అప్పా.
“తెలుసు అంకుల్,” అని నవ్వుతూ అన్నాడు ఆర్యన్.
“తెలిసి కూడా ఎందుకు ఇష్టపడుతున్నావ్ మరి?” అడిగింది స్వీటీ సడన్*గా…
“శిశిర గురించి నాకన్నా మీకు ఎక్కువ తెల్సు ఆంటీ, మీరు ఎందుకు తనని ఇష్టపడుతున్నారో, నేను కూడా అందుకే ఇష్టపడుతున్నాను,” అన్నాడు తను.
స్వీటీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అడిగింది, తను అమ్మ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ మొహమాటపడకుండా సమాధానం చెప్పాడు. కొంచెం సేపయ్యాక,
“నేనిక బయలుదేరతాను అంకుల్,” అంటూ ఆర్యన్ లేచాడు.
“సరే బాబు,” అన్నారు అప్పా.
“వెళ్ళొస్తాను ఆంటీ,” అని స్వీటీకి చెప్పాడు.
స్వీటీ, “ఒక్క నిముషం,” అని లోపలికి వెళ్ళింది. నేను ఏం జరగబోతుందో అని చూస్తున్నాను.
“ఇది తీస్కో…” అంటూ మా అమ్మ లోపల్నుంచి Haldiram’s రసగుల్లా డబ్బా తీసుకొచ్చి ఆర్యన్ చేతికి అందించింది.
“అరే.. వద్దు ఆంటీ..” అన్నాడు తను.
“తీస్కో బాబు, నువ్వు మాకు నచ్చావు. అందుకే, స్వీట్ ఇస్తోంది మీ ఆంటీ,” అన్నారు మా అప్పా.
స్వీటీ కూడా నవ్వుతూ, “తీస్కో బాబు,” అంది.
ఇంక నా ఆనందానికి అవధుల్లేవు… స్వీటీని వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను.
“హడలిపోయాను స్వీటీ… నీకు నిజంగానే ఆర్యన్ నచ్చలేదేమో అనుకున్నాను,” అని కన్నీళ్ళతో అన్నాను.
“మీ అప్పాకి నచ్చింది ఏదైనా నాకు నచ్చకుండా ఉంటుందేంటే.! ఇంత పెద్ద డెసిషన్ నాకు చెప్పకుండా మీ అప్పాకే చెప్పినందుకు ముందు బాధ వేసింది… కానీ, అబ్బాయిని చూసాక, మాట్లాడాక నీ సెలక్షన్ బాగుంది అనిపించింది… పోనీలే, మాకు పెద్ద పని తప్పించావ్… మేరేజ్ బ్యూరోల చూట్టూ తిరక్కుండా, వాళ్ళనీ వీళ్ళనీ సంబంధాల కోసం అడక్కుండా…” అంది అమ్మ నవ్వుతూ నా తలమీద చెయ్యివేసి…
ఆర్యన్ కూడా హ్యాపీగా స్వీట్ తీస్కోని, “రేపు శిశిరని మా ఇంటికి తీసుకెళ్ళచ్చా అంకుల్?” అని అడిగాడు. అప్పా దానికి ‘సరే’ అన్నారు. తర్వాత తను అందరికి నమస్తే చెప్పేసి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే అంతా సాఫీగా జరిగిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయాక ఆర్యన్ కాల్ చేసాడు.
“రేపు మా ఇంటికి వద్దువ్ గానీ, నేను 11 am కి వచ్చి నిన్ను తీస్కెళ్తా..” అన్నాడు. నేను ‘సరే’ అన్నాను.
“నీకేమీ టెన్షన్ లేదా?” అడిగాడు తను.
“నేను నచ్చనివాళ్ళు అసలు ఉంటారా… చెప్పు,” అన్నాను నేను.
తను దానికి చాల గట్టిగా నవ్వాడు.
“మరీ అంత నవ్వాల్సిందేముంది? నిజమే కదా…” అన్నాను నేను.
“నిజంగా… నిజమే… నువ్వు నచ్చనివాళ్ళు ఎవరూ ఉండరు,” అన్నాడు తను
______________________________
Sindhu