కావలెను – Part 3

బాత్రూంలో నుండి బయటకు వచ్చి అడిగాడు అనిరుద్ర. “ముగ్గు గిన్నె ఎక్కడ?” అని.

“ఎందుకు?” అడిగింది అనిమిష.

“ఎందుకేమిటీ… డ్యూటీ ఎక్కడానికి… వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టాలిగా… డ్యూటీలో జాయిన్ అయిపోతాను”

“వద్దోద్దు… బయట మా బాస్ ఉన్నారు. ఈ ఒక్కరోజు నేనే చేస్తాను” అంది అనిమిష.

“నా జీతంలో కట్ చేస్తే ఊర్కోను” అన్నాడు అనిరుద్ర.

“చేయను…”

“సరే… అన్నట్టు ఈవేళ కూరేం చేయాలి” అడిగాడు అనిరుద్ర..

“ఈ రోజు ఆఫీసులో మా బాస్ పార్టీ ఇస్తున్నారు. నాతోపాటు మీరూ రావాలి”

“బస్సులో అయితే రాను.. ఎట్లీస్ట్ ఆటోలో అయితేనే వస్తాను”

“సరే” అంది అప్పటికా గండం తప్పించుకోవాలని.

****

ఆ వేళ మధ్యాహ్నం శోభరాజ్ ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు అనిమిష దంపతులకు. అనిమిష అనిరుద్రలకు కలిపి ఓ చెక్ వున్న కవర్ ఇచ్చి చెప్పాడు, “ఇంటికి వెళ్లాక చూసుకోవాలి. అప్పటివరకు సస్పెన్స్” అని. అంతా భోజనాలు చేస్తున్నారు. శోభరాజ్ అనిరుద్రతో అన్నాడు.

“మిస్టర్ అనిరుద్ర… మీరు లక్కీ.. అనిమిషలాంటి అమ్మాయి మీకు భార్యగా దొరికినందుకు”

నవ్వాడు అనిరుద్ర. శోభరాజ్ కొనసాగించాడు.

“నిజం చెప్పాలంటే… టుబీ ఫ్రాంక్ నేను అనిమిషను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. పెళ్లి ప్రపోజల్ కూడా చేశాను. అయినా అనిమిష ధైర్యంగా సిన్సియర్గా నాకు ‘నో’ చెప్పింది. మీరు లక్కీ అని ఎందుకు అన్నానంటే… ఏ అమ్మాయి అయినా డబ్బుకన్నా కీర్తిప్రతిష్టలకన్నా ఎవరు ముఖ్యం అని భావిస్తుందో ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడే. ఆ విధంగా నన్ను రిజెక్ట్ చేసి మిమ్మల్ని సెలక్ట్ చేసుకుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ జంటను

ఆశీర్వదిస్తున్నాను”

అనిమిష మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్. తను మోసం చేసిందా… అన్న గిల్టీ కాన్షియసనెస్.

“ఫ్ అంతా గిఫ్ట్లు ఇచ్చారు. కొందరు క్యాష్ చెక్లు ఇచ్చారు. ద్విముఖ ఓ కవర్లో చెక్ పెట్టి అనిమిషకు ఇచ్చింది. అనిరుద్రకు ఓ కార్డు మీద, ‘కలిసి వుంటే కలదు సుఖం’ అని క్యాప్షన్ రాసి కవర్లో పెట్టి ఇచ్చింది.

***